Leap

Computer Science. Technology. Impression

స్థితి

తేది: ఫిబ్రవరి 17, 2019
స్థలం: R.K Beach, విశాఖపట్టణం.


ఎడతెగని సముద్రపు ఉఛ్వాస నిశ్వాసలు.
గాయలతో సైతం ఠీవిగా నిల్చున్న రాళ్ళు .
యంత్రపు నావలతో, చేపల వేటలో మునిగిన జాలరి బృందం.
నారింజ వర్ణంలో మెరిసే ఉదయపు సూర్యుడు.
తీరం వెంబడి సముద్రుడు చిలికిన వెన్న.
అడ్డదిడ్డమైన అలలు, అవి చేసే అర్ధం లేదనిపించే శబ్దం.
అలలచే వొడ్డుకు నెట్టబడిన ఎండ్రకాయల పరుగు.
తీరంలో సగం నీట మునిగిన రాతిపై కూర్చుని వెనుదిరిగి, వెనుదిరిగిన అలను చూచినప్పుడు అది నన్ను లోనికి లాగేస్తుందేమోనన్న భయం.
రాతిపైకి ఎగబాకి నన్ను తాకడనికి ప్రయత్నిస్తున్న నీరు.

ఈ అందాల్ని ఆస్వాదించడానికి వచ్చిన ఎందరో జనం; సముద్రం కొందరికి పాత; కొందరికి క్రొత్త.
వెంట వచ్చిన వారితో తీరం వెంబడి నడుస్తూ కొందరు; ఛాయ చిత్రాలు తీయడంలో మునిగిన వారు కొందరు; అలల తాకిడిని ఆస్వాదిస్తూ ఒళ్ళంతా తడుపుకునే వారు మరికొందరు.
వారి అనుభూతులను అంచనా వెసేందుకు ప్రయత్నం చేస్తున్న నేను.

ఆలోచనల సుడిగుండంలోకి నన్ను లాగడానికి ప్రయత్నించి గెలిచిన మనస్సు.

ఇక్కడ వున్న అందరూ ఈ అందాన్ని (వారి రీతిలో) ఆస్వాదిస్తున్నారా? కాదనిపించింది.
ఆస్వాదించడం అనేది వారి స్థితి పై ఆధార పడుతుంది.
ఎన్నో సార్లు గొప్పవనిపించే సందర్భాలను ఆస్వాదించలేకపోయాను.
స్థితి చాల ముఖ్యమైనది, అది మనం చేసే పనులను కూడా తీవ్రంగా ప్రభావితం చేయగలదు.
మంచిదనిపించే స్థితిలో ఉంటే అంతా మంచిదే, అంతా అందమే.
మంచి స్థితిలో ఉండటానికి స్వీయకృషి చాలా అవసరం.

ఈ ఆలోచన నన్ను తట్టడం ఇది మొదటిసారేమి కాదు.
ఇకచేయవలసింది; మంచి స్థితిలో ఉండాలనే ధృఢనిశ్చయంతో కృషి చేయడమే!

పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పెద్దలు ఊరికే అనలేదు కదా!

P.S:

Here is a video that talks about this same idea: Only your state matters published by Infognostica on Jul 5, 2019.